కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండ

 


కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నది.. ఆపత్కాలంలో ప్రభుత్వమే స్వయంగా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు మేలు చేస్తున్న సంగతి విదితమే. మరికొన్ని రోజుల్లో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు రైతుబంధు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఆదివారం వ్యవసాయశాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో ఎకరానికి రూ.5 వేల చొప్పున నగదు జమ కానున్నది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 15లోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనుంది.


ఖమ్మం జిల్లాలో 3.04 లక్షల మందికి లబ్ధి..

ఖమ్మం జిల్లాలో పాస్‌పుస్తకాలు ఉన్న రైతులు 3.04 లక్షల మంది ఉండగా వారందరికీ త్వరలో పెట్టుబడి సాయం అందనుంది. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.357 కోట్లు విడుదల చేయనున్నది. బ్యాంకు ఖాతాలు మార్చుకున్న రైతులు, కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు కలిగి ఉన్న రైతులూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.


1,39,707 మందికి..

జిల్లావ్యాప్తంగా 1,39,707 మంది రైతులకు నగదు అందనుంది. రైతుబంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వ్యవసాయశాఖ అధికారులు వెంటనే జాబితాను సిద్ధం చేయనున్నారు జిల్లాలో రైతులకు గాను రూ.213 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన 1,17,067 మంది సాధారణ రైతులు, 22,640 మంది పోడురైతులకు లబ్ధి చేకూరనుంది.


కష్టకాలంలో ఆదెరువు..

కరోనా కాలంలో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు రైతుబంధు ఇస్తున్నారు. సీఎం సార్‌కు కృతజ్ఞతలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మరికొన్ని రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది.

-బత్తుల వీరయ్య, అత్మ కమిటీ చైర్మన్‌