రాష్ట్రంలో ధరణి రిజిస్ట్రేషన్లకు మరోసారి బ్రేక్

 


 రాష్ట్రంలో ధరణి రిజిస్ట్రేషన్లకు మరోసారి బ్రేక్ పడింది. కరోనా కట్టడి భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నుంచి 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. స్లాట్లు బుక్‌ చేసుకున్న వారికి 21 తర్వాత రీషెడ్యూల్‌ చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒక్క రిజిస్ట్రేషన్ చేయాలంటే కార్యాలయంలో నలుగురు లేదా ఐదుగురు అవసరం ఉంటుందని, క్రయ విక్రయదారులు, సాక్షులు ఇతరులు రావడంతో కార్యాలయాల్లో రద్దీగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో కరోనా సోకే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎస్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహశీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు.