ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు

 

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు వ
రుసగా మూడో రోజూ కొనసాగింది. శుక్రవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం 49,169 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 256 పాయింట్లు లాభపడి 49,206 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 49,036 వద్ద కనిష్ఠాన్ని.. 49,417 వద్ద గరిష్ఠాన్ని చవిచూసింది. ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ రోజులో 14,863-14,765 మధ్య కదలాడి చివరకు 98 పాయింట్లు ఎగబాకి 14,823 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.91 వద్ద నిలిచింది.


అంతర్జాతీయ సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణించాయి. లోహ, ఆర్థిక, టెలికాం షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. కరోనా వ్యాక్సిన్‌పై మేధోసంపత్తి హక్కు రద్దు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా అంగీకరించడం మదుపర్లను మెప్పించింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి.


బీఎస్‌ఈ 30 జాబితాలో బజాజ్ ఫినాన్స్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, రిలయన్స్, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి... బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో స్థిరపడ్డాయి.