తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి గోవా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

 

 అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. ఉగ్రరూపాన్ని దాల్చింది. గంటగంటకూ బలపడుతోంది. పెను తుఫాన్‌గా అవతరించింది. క్రమంగా అది గుజరాత్ వైపు కదులుతోంది. ఈ నెల 18వ తేదీన తెల్లవారు జామున గుజరాత్ వద్ద తీరాన్ని తాకబోతోంది. ఈ తుఫాన్ ప్రభావం అయిదు రాష్ట్రాలపై పడింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ వైపు కదులుతున్న కొద్దీ దాని తీవ్రత మరింత అధికమౌతోంది. కేరళలో ఇప్పటికే సముద్రం పోటెత్తింది. మంగళూరు వంటి కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


తాజాగా- తౌక్టే తుఫాన్ ప్రభావం గోవాపై పడింది. ఈ తెల్లవారు జామున 2:30 గంటల సమయానికి తౌక్టే తుఫాన్ గోవా రాజధాని పనాజికి ఆగ్నేయ దిశగా అరేబియా సముద్రంలో 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముంబైకి దక్షిణ దిశగా 490, గుజరాత్‌లోని వెరావల్‌కు 730 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. తుఫాన్‌కు అతి సమీపంలో ఉన్నందున పనాజి సహా గోవా వ్యాప్తంగా దాని ప్రభావం ఉందని పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారు జామున గుజరాత్‌లోని పోర్బందర్-భావ్‌నగర్ జిల్లాలోని మహువా మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేశారు.తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి గోవా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి గోవా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తీర ప్రాంతాలను ఖాళీ చేయించింది. తీర ప్రాంత వాసులను పునరావాస శిబిరాలకు తరలించింది. పలు చోట్ల జాతీయ, రాష్ట్రస్థాయి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలను మోహరింపజేసింది. శనివారం రాత్రి 11:30 గంటలకు పనాజికి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటి నుంచే దాని ప్రభావం కనిపించింది. రాత్రంతా వర్షాలు పడ్డాయక్కడ.


మరో 24 గంటల పాటు గోవా, దక్షిణ కొంకణ్ ప్రాంతాలు, వాటికి ఆనుకుని ఉన్న ఘాట్లల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తుఫాన్ గోవా తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తోన్నారు. ఆ సమయంలో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారుతుందని, అలలు రెండు మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పనాజీకి చెందిన వాతావరణ కేంద్రం సైంటిస్ట్ రాహుల్ ఎం తెలిపారు. ఇప్పటికే గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రం పొడవునా తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది.