తెలంగాణలో లాక్‌డౌన్‌తో కోవిడ్ సెకండ్‌ వేవ్‌లో కేసులు తగ్గుముఖం

 


తెలంగాణలో లాక్‌డౌన్‌తో కోవిడ్ సెకండ్‌ వేవ్‌లో కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఆ వెంటనే ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్‌డౌన్‌ పొడిగింపు అమల్లోకి వచ్చినట్లయ్యింది. జూన్‌ 9 వ తేదీ వరకు తెలంగాణ అంతటా లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.


రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నా ఇప్పటికీ రోజుకు మూడు వేల కేసులు వస్తున్నాయి. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా మరో 10 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. సడలింపులు పెంచింది. ఇవాళ్టి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయి. ఆ తర్వాత మరో గంట పాటు అదనపు సమయం కేటాయించింది. ఈ సమయంలో ఇళ్లకు చేరుకునేవారు చేరుకోవాల్సి ఉంటుంది. 2 గంటల తర్వాత రోడ్డు మీద కనిపిస్తే పోలీసులు కేసులు నమోదుచేస్తారు. వాహనాలు సీజ్ చేస్తారు.


కోవిడ్ సెకండ్ వేవ్‌తో మే 12 నుంచి తొలిసారి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత మరోసారి పెంచింది. ఇప్పుడు ఇంకో సారి పొడిగించింది. అయితే ఈసారి లాక్‌డౌన్ నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్‌తో సర్కార్‌ ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రైవేట్ ఆఫీసులు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. సడలింపు సమయంలో ఆర్టీసీ, సెట్విన్, మెట్రో, ఆటో, ట్యాక్సీలు నడుపుకోవచ్చు. సరుకు రవాణా వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. సరిహద్దుల వద్ద పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. అయితే అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు యథావిధిగా అనుమతి లేదు.


థియేటర్లు, పార్క్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌ మూసి ఉంచాల్సిందే. బార్లు, పబ్బలు, జిమ్‌లు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పెట్రోల్‌ బంక్‌లు తెరిచి ఉంటాయి. అయితే హైవేపై ఉండే పెట్రోల్‌ బంక్‌లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సర్వీసులకు యథావిధిగా అనుమతి ఉంటుంది. ఈసారి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయనుంది తెలంగాణ సర్కార్. సడలింపు సమయంలో కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోనుంది. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలోనే ప్రజలంతా తమ పనులు ముగించుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరారు.