మెట్రో స్మార్ట్‌ టికెటింగ్‌ విధానాన్ని అమలు

 


కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు బయటకెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థ మెట్రోరైలులో కరోనా నియంత్రణకు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. మెట్రోరైలు, స్టేషన్లతోపాటు కౌంటర్ల వద్దకెళ్లి టికెట్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మెట్రో స్మార్ట్‌ టికెటింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ సాయంతో ఈజీగా ప్రయాణించేందుకు అవసరమైన టికెట్‌ ఏర్పాట్లు చేశారు. ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీ తర్వాత ఎక్కువమంది ప్రయాణం చేస్తున్నది మెట్రో రైళ్లల్లోనే. ప్రస్తుతం మూడు కారిడార్లలో అందుబాటులోకి రాగా, మొత్తం 69 కి.మీ మేర మెట్రోరైళ్లు ప్రతినిత్యం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి.


అందుబాటులో 4 మొబైల్‌ యాప్‌లు.


కౌంటర్‌లో డబ్బులు చెల్లించకుండా స్మార్ట్‌కార్డ్‌తోపాటు క్యూఆర్‌ కోడ్‌ ఉండే సరిపోతోంది.

టికెట్‌ కోసం క్యూలైన్లలో నిలబడకుండా టికెట్‌ తీసుకొని దర్జాగా ప్రయాణించొచ్చు.

కాంటాక్ట్‌లెస్‌ టికెటింగ్‌ విధానంలో భాగంగా 4 మొబైల్‌ యాప్‌ల ద్వారా టికెట్లను పొందవచ్చు.

ఇందులో టీఎస్‌ సవారీ, ఫోన్‌పే, పేటీఎం, మేక్‌ మై ట్రిప్‌ ఇలా నాలుగు మొబైల్‌ యాప్‌ల్లో దేని నుంచైనా మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు స్మార్ట్‌ఫోన్‌లోనే టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం మూడు కారిడార్‌ల పరిధిలో ఒక మెట్రోస్టేషన్‌ నుంచి మరో మెట్రోస్టేషన్‌ వరకు టికెట్‌ను మొబైల్‌లోనూ తీసుకునే వెసులుబాటు కల్పించారు.

దీంతో కౌంటర్‌ వద్ద వేచి ఉండాల్సిన అవసరమే లేదు.

ఇందులో టీ సవారీ యాప్‌ ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్నదైనా, మిగతావి మాత్రం ప్రైవేటు సంస్థలవి కావడంతో వాటి నిర్వహణ మెరుగ్గానే ఉన్నదని మెట్రో అధికారులు వివరించారు.