పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(26) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది.

 


పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(26) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా మామ కూతురితో ప్రేమాయణం సాగిస్తున్న ఈ ప్రపంచ నెంబర్‌ 1 బ్యాట్స్‌మెన్‌.. వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడని సమాచారం. ప్రస్తుతానికి ఇరు కుటుంబాల మధ్య మాటలు పూర్తయ్యాయని, పెద్దలు పరస్పర అంగీకారానికి వచ్చాక, వచ్చే ఏడాది ఆరంభంలో వీరి జంట ఓక్కటి కాబోతుందని బాబర్‌ సన్నిహితులు స్థానిక మీడియాకు తెలిపారు. కాగా, బాబర్‌ పెళ్లి విషయమై సహచర ఆటగాడు, పాక్‌ మాజీ కెప్టెన్‌ అజహర్‌ అలీ ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు చేశాడు.


కెప్టెన్‌కు మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా అని ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను స్పందిస్తూ.. త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించాడు. అయితే యాదృచ్చికంగా అజహర్‌ అలీ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే పాక్‌ కెప్టెన్‌ పెళ్లి విషయమై వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, గత కొద్ది కాలంగా కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న పాక్‌ కెప్టెన్‌.. ఇటీవలే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి ప్రపంచ నెంబర్‌ 1 బ్యాట్స్‌మెన్‌ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇటీవలే జింబాబ్వే పర్యటనను ముగంచుకుని స్వదేశానికి చేరుకున్న బాబర్‌.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.