గ్రామ పంచాయతీ స్వచ్ఛతా అభియాన్‌ కార్యక్రమంలో బళ్లారి జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానం

 


 గ్రామ పంచాయతీ స్వచ్ఛతా అభియాన్‌ కార్యక్రమంలో బళ్లారి జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానం ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కేఎస్. ఈశ్వరప్ప వెల్లడించారు. సోమవారం జిల్లా క్రీడామైదానంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అభియాన్‌ (గ్రామీణ) పథకంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో చెత్తను తరలించే 50 వాహనాలను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ మొత్తం 172 వాహనాలను గ్రామ పంచాయతీలకు అందజేసినట్లు చెప్పారు. బళ్లారి, విజయనగర జిల్లాలో మొత్తం 237 గ్రామ పంచాయతీల్లో అధికంగా చెత్త నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేశామని వివరించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) పథకం క్రింద ప్రతి గ్రామ పంచాయతీకి రూ 20 లక్షలు వరకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ నిధులతో పరిశుభ్రత చర్యలు చేపడతా మన్నారు.


ఈ కార్యక్రమంలో బళ్లారి లోక్‌సభ సభ్యుడు వై. దేవేంద్రప్ప, ఎమ్మెల్యేలు కరుణాకర్‌ రెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కేసీ కొండయ్య, బీ.నాగేంద్ర, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌, విజయనగర జిల్లా ప్రత్యేక అధికారి అనిరుద్‌ శ్రావణ్‌, జిల్లా పంచాయతీ సీఈఓ కేఆర్‌ నందిని, జిల్లా పంచాయతీ యోజనాధికారి జానకిరామ్‌ పాల్గొన్నారు.