తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ పెంచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

 


తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ పెంచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఆయన రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత హుజూరాబాద్‌ వెళ్లి కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేసిన ఈటల.. వారం రోజుల్లో కాషాయ కండువా కప్పుకోనున్నారు.


తనది కమ్యూనిస్టు డీఎన్‌ఏ అయినప్పటికీ, ప్రజల ఇష్టం మేరకే బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు ఈటల. పార్టీ ఏర్పాటు డబ్బుతో కూడుకున్న వ్యవహారమని, అందుకే వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే.. బీజేపీలో చేరుతున్నానన్నారాయన.

టీఆర్ఎస్‌లో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని, ఐదేళ్ల నుంచి కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందని ఈటల అన్నారు. మంత్రులు లేకుండానే సమీక్షలు జరిగాయని ఆరోపించారు. ప్రగతి భవన్‌కు బానిస భవన్‌ పేరు పెట్టుకోవాలని విమర్శించారు. దీంతో ఈటలపై ఎదురుదాడికి దిగారు అధికారపార్టీ నేతలు. ఈటలకు ఆత్మగౌరవమే లేదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటలకు ఆస్తులపైనే గౌరవం ఉందంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. దేవరయాంజల్‌ భూములను అప్పగించిన తర్వాతే.. ఈటలను బీజేపీలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు మరో మంత్రి గంగుల కమలాకర్‌.


అటు ఈటల రాజేందర్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ కంట్రోల్ చేస్తోందన్న ఈటల వ్యాఖ్యలను ఖండించారు. ఇన్నాళ్ళు కేసీఆర్ వెంటే ఉన్న ఈటల ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మట్లాడుతున్నాడని ఆరోపించారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.