నిత్యం కూలి చేస్తేనే కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బందులు

 


మోమిన్‌పేట, న్యూస్‌టుడే: నిత్యం కూలి చేస్తేనే కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బందులు పడే పేదలు కరోనా, లాక్‌డౌన్‌తో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కరవై పూట గడవటమే కష్టమవుతోంది. సడలింపు సమయం పెంచినా పని దొరక్క సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఉచితంగా అదనపు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 8,10,000 మంది రేషన్‌లబ్ధిదారులకు నేటి నుంచి బియ్యం అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో 588 రేషన్‌ దుకాణాల పరిధిలో 2,34,935 రేషన్‌, 2,673 అంత్యోదయ కార్డులున్నాయి. రేషన్‌ కార్డున్న కుటుంబంలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున, అంత్యోదయ, అన్నపూర్ణకార్డుల వారికి సాధారణంగా ఇచ్చే 35 కిలోలతో పాటు పది కిలోలు అదనంగా బియ్యం ఇవ్వనున్నారు.


నిబంధనలు పాటించాలి


- రాజేశ్వర్‌, జిల్లా ఇన్‌ఛార్జి పౌరసరఫరాల అధికారి


జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్‌ దుకాణాల ద్వారా నేటి నుంచి ఉచిత బియ్యం అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. దుకాణాల వద్దకు వచ్చే లబ్దిదారులు, డీలర్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి. ఇందుకు తగిన ఆదేశాలు ఇచ్చాం. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ లబ్ధిదారులు సరకులు తీసుకోవాలి.