రెండు, మూడు రోజుల్లో దక్షిణ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం

 

ఈ నెల 3వ తేదీన దక్షిణ కేరళను తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ అంతటా విస్తరించాయి. ఆ ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడు, కర్నాటకలో కొంతభాగానికి నైరుతి విస్తరించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.రెండు, మూడు రోజుల్లో దక్షిణ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్నం ప్రకటించారు. నైరుతి దిశ నుంచి దక్షిణ తెలంగాణకు ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో 2021, జూన్ 05వ తేదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు రుతుపవనాలు టచ్ చేశాయి. అవి క్రమంగా ఆయా రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. 2,3 రోజుల్లో కర్నాటక, తమిళనాడు, లక్షద్వీప్‌లోని అన్ని ప్రాంతాలకు, మహారాష్ట్ర, గోవా, మధ్య అరేబియా సముద్రం, ఈశాన్య., మధ్య బంగాళాఖాతం, ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.


నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలోనూ, కోస్తాంధ్రలోనూ అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అనంతపురం టవర్‌క్లాక్‌ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్‌ సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. మోకాలి లోతు వర్షపునీటిలోనూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వెళ్లారు స్థానికులు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలో భారీవర్షం పడింది. ఈదురుగాలులు వీస్తున్న సమయంలో కారు మబ్బులు అలముకున్నాయి. అంతలోనే వర్షం కురిసింది. దీంతో వేసవి వేడి నుంచి సేదదీరారు స్థానికులు. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం కనువిందు చేస్తోంది. రెండురోజుల పాటు కురిసిన వర్షానికి.. బొగత జలపాతం నుంచి కిందకు నీళ్లు జాలువారుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో సందర్శకుల తాకిడి లేకుండాపోయింది.