కేసులకు భయపడి మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని వైఎస్ షర్మిల......

 


 కేసులకు భయపడి మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం మామూలేనని పేర్కొన్నారు. కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అని కొట్టిపారేశారు. తమ పార్టీలోకి వస్తానంటే ఈటలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో ఎటువంటి చర్చలేదని షర్మిల చెప్పారు. రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెడుతున్నామని తెలిపారు. టేబుల్ ఫ్యాన్ గుర్తంటూ ఫూలిష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుర్తు ఎంపికపై ఇప్పటి వరకు ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పార్టీ విధివిధానాలు రూపొందిస్తామని షర్మిల ప్రకటించారు. కరోనా విషయంలో ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ పాఠాలు నేర్చుకోలేదని, కొవిడ్‌ను ఎదుర్కొనే ఉద్దేశం ఆయనకు లేదని విమర్శించారు. నిద్రపోతున్నట్లు నటిస్తున్న వారికి ఏం చెప్పలేమన్నారు.

వైఎస్సార్ టీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ సంక్షేమం కోసం పార్టీ పెడుతున్నామని షర్మిల ప్రకటించారు. ''కార్యకర్తలకే పార్టీలో పెద్ద పీట వేస్తాం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టపడే కార్యకర్తలే రేపటి నాయకులు. కార్యకర్తలు చెప్పిందే మన పార్టీకి సిద్ధాంతం. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా పార్టీ విధానాలుంటాయి. పార్టీ పెట్టబోయే ఈ నెలరోజులు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి'' అని షర్మిల చెప్పారు.