మనం అందరమూ ఈ ప్రతిజ్ఞ చేసినవాళ్లమే.

 


మనం అందరమూ ఈ ప్రతిజ్ఞ చేసినవాళ్లమే. పెద్దయ్యి చదువులలోని సారమెల్ల గ్రహించడంతోపాటు బతుకు పాఠాలు నేర్చుకోవడంలో మునిగిపోయిన క్షణం నుంచి ప్రతినబూనడానికి బిగించిన పిడికిలి ఎప్పుడు సడలిందో మనకు గమనింపు కూడా ఉండదు. దేశాన్ని ప్రేమించడం, దేశం లో అందరినీ సహోదరులుగా భావించడం... ఈ రెండూ జీవితపు సోపానపటంలో ఇమడని అంశాలుగా మారిపోతున్నాయి కూడా. అభ్యున్నతి బాటలో ఎదగడం కోసం మన మనసు పరిధిని కుదించుకుంటూ పోతున్నాం.


మనం ఇలా ఉంటే... చదువుకోవడానికి మనదేశానికి వచ్చిన వియత్నాం మహిళ తనదేశంతో సమానంగా మనదేశాన్ని కూడా ప్రేమిస్తోంది. పేదవాళ్లకు ఆహారధాన్యాలను, ఆత్మీయతను పంచుతోంది. ''కోవిడ్‌ 19తో ప్రపంచం కుదేలయిపోతోంది. మా దేశంలో మేమంతా సంఘటితమై కరోనాతో పోరాడుతున్నాం. భారతదేశం చేస్తున్న పోరాటంలో మా వంతుగా ఓ చిన్న సహాయం మాత్రమే'' అన్నారు ఫామ్‌ థి లెన్‌. ఆమె గుంటూరు జిల్లా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వియత్నాం వాసులను అనుసంధానం చేస్తున్నారీమె.