అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ ఐటీ నిపుణులదే హవా..

 


అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ ఐటీ నిపుణులదే హవా.. వారు లేకుండా ఆర్థిక, టెక్నాలజీ కార్యకలాపాలు సాగడం అనూహ్యమే. కానీ ఆ దేశ ప్రగతిలో కీలక భూమిక వహిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్నారై) మాత్రం అనునిత్యం వివక్షకు గురవుతున్నట్లు తేలింది. అమెరికాలో జీవిస్తున్న విదేశీయుల్లో రెండో స్థానం ప్రవాస భారతీయులదే. అయినా వివక్ష సహజమేనని, సర్వ సాధారణం అని తేలింది.


గతేడాది సెప్టెంబర్ 1-20 తేదీల మధ్య కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్, జాన్స్‌ హాప్కిన్స్‌-ఎస్‌ఏఐఎస్, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఈ అంశాలను నిగ్గు తేల్చింది.


'సోషల్‌ రియాలిటీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌: ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్' అనే అంశంపై ఈ సర్వే సాగింది. ఇందులో 1,200 మంది ఇండో-అమెరికన్లు పాల్గొన్నారు.


2018 గణాంకాల ప్రకారం అమెరికా జనాభాలో ఒకశాతానికి పైగా భారతీయులే. అంటే సుమారు 46 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు తెలిసింది. ఇక అక్కడే పుట్టి, అమెరికా పౌరసత్వం పొందిన చాలా మంది వారి శరీర వర్ణం ఆధారంగా వివక్షకు గురవుతున్నట్లు తెలిపింది.