టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పిచ్చోడినయ్యానని ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్సమన్ సామ్‌బిల్లింగ్స్ తెలిపాడు. భారత్‌లో మహీని ఆదరించే తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
2018, 19 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సామ్ బిల్లింగ్స్.. ఆ సమయంలో ధోనీని దగ్గరుండి చూశానని చెప్పాడు. మహీ సారథ్యంలో ఆడటం తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. తాజాగా హెడ్‌స్ట్రాంగ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ ఇంగ్లిష్ క్రికెటర్ మహీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ కెప్టెన్సీలో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. దాంతో అతన్ని దగ్గరుండి చూసే అవకాశం దక్కింది. హోటల్లో అతని జీవనశైలిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మ్యాచ్ జరిగేటప్పుడు లేదా ప్రాక్టీస్‌కు వెళ్లినప్పుడు మాత్రమే అతడిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అస్సలు వదలబుద్ధి కాదు.
ఇక్కడి ప్రజలు ధోనీని ఎలా ఆరాధిస్తారో చూసిన తర్వాతనా మైండ్ బ్లాక్ అయింది' అని సామ్ చెప్పుకొచ్చాడు. అలాగే ఇంగ్లండ్‌లో ఎవరినైనా క్రికెట్ అంటే ఇష్టమా? అని అడిగితే వాళ్లకి ఇష్టమనో.. ఇష్టం లేదనో చెబుతారని, కానీ అదే భారత్‌లో మాత్రం ఎవర్ని అడిగినా క్రికెట్ అంటే పడి చచ్చిపోతామని చెబుతారని పేర్కొన్నాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2018లో 10 మ్యాచ్‌లే ఆడిన సామ్.. 108 పరుగులు చేశాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక 2019లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడినా.. తర్వాత అవకాశం దక్కలేదు. ఈ క్రమంలోనే 2020లో అసలు టోర్నీలోనే లేడు. అయితే, ఈసారి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.2కోట్లకు కొనుగోలు చేసింది.
కానీ ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అతనికి చోటు దక్కలేదు. మరి సెప్టెంబర్‌లో జరిగే సెకండాఫ్ లీగ్‌లో అయినా అతను బరిలోకి దిగుతాడో లేదో వేచిచూడాలి. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఐపీఎల్ తిరిగి ప్రారంభమైతే తమ ఆటగాళ్లను ఆడించబోమని స్పష్టం చేసింది.