ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌)లో నిర్దిష్ట వాటాను బైజూస్‌ సొంతం

 


ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌)లో నిర్దిష్ట వాటాను బైజూస్‌ సొంతం చేసుకోవడానికి,బైజూస్‌లో ఏఈఎస్‌ఎల్‌ విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. పోటీ చట్టం 2002లోని సెక్షన్‌ 31(1) ప్రకారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదిత ఒప్పందం ద్వారా, ఏఈఎస్‌ఎల్‌ను బైజూస్‌ విలీనం చేసుకుని, బైజూస్‌ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంటే, ఏఈఎస్‌ఎల్‌పై సంపూర్ణ, ఏకైక నియంత్రణను బైజూస్‌ పొందుతుంది.


మన దేశంలో ఏర్పాటైన ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బైజూస్‌. నేరుగా, తన అనుబంధ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ విద్య సేవలను ఇది అందిస్తున్నది. ప్రాథమిక, మాధ్యమిక పాఠ్యాంశాలతోపాటు, దేశ, విదేశాల్లోని ఇంజినీరింగ్‌, వైద్య విద్య వంటి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు శిక్షణ సేవలను సాంకేతికత ఆధారిత విద్యావేదిక ద్వారా అందిస్తోంది. ఏఈఎస్‌ఎల్‌, మన దేశంలో ఏర్పాటైన పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థ. ఏఈఎస్‌ఎల్‌, నేరుగా లేదా తన అనుబంధ సంస్థ అయిన ఆకాష్‌ ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా లేదా తన శాఖల ద్వారా, ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఒలింపియాడ్స్‌, నేషనల్‌ టాలెంట్‌ సెర్ట్‌ ఎగ్జామినేషన్‌ వంటి ప్రిపరేషన్ సేవలతోపాటు ప్లస్‌టూ విద్యార్థులకు పాఠ్యాంశ ఆధారిత శిక్షణను అందిస్తుంది.