విజయనగరం కార్పొరేషన్‌లో సమస్యలు

 


విజయనగరం కార్పొరేషన్‌లో సమస్యలు తిష్టవేశాయి. తొలి పాలకవర్గ సమావేశానికి కొవిడ్ మోకాలడ్డుతోంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఆయా డివిజన్ల ప్రజా సమస్యలను సభలో లేవనెత్తలేని పరిస్థితి నెలకొంది. అలా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఓ వైపు కరోనా, మరోవైపు కార్పొరేషన్‌లో పేరుకుపోయిన సమస్యలతో జనం అవస్థలు పడుతున్నారు.


విజయనగరం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కొత్తపాలక వర్గం కొలువుదీరింది. తొలి కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే కరోనా విజృంభించింది. కొత్తగాఎన్నికైన డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి కొవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు. పలువురు కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందికి వైరస్ సోకి పాలన స్తంభించింది.

నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు మార్చి 14న వచ్చాయి. జూన్ నెల 18న కొత్త పాలకవర్గం కొలువుదీరింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అదే రోజు జరిగింది. కొత్త పాలకవర్గం ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు రెండు సమావేశాలు, కొవిడ్ వాక్సినేషన్‌పై అవగాహన సదస్సు మాత్రమే జరిగాయి.


మార్చి 30న కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. క్లాప్, టిడ్కో ఇళ్లకు సంబంధించిన అంశాలపై కౌన్సిల్‌లో సభ్యులు చర్చించారు. డివిజన్లలోని సమస్యలను సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. సమయం లేని కారణంగా ముగించారు. తర్వాత ఏప్రిల్ 7న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వాలంటీర్లు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కరోనా ఉధృతి కారణంగా సమావేశాలు జరగలేదు.


మే 4న డిప్యూటీ మేయర్ నాగలక్ష్మి మృతికి సంతాపాన్ని కూడా అధికారులు ప్రకటన ద్వారా తెలిపారు. పలువురు అధికారులు, సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో రెండు నెలలుగా సమస్యల పరిష్కారం లేక, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది.


కొన్నాళ్లుగా నగరంలో రహదారులు, కాలువలు, పారిశుద్ధ్యం, ఉద్యానవనాల అభివృద్ధి, వీధి దీపాలు, తాగునీటి సమస్యలతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్, టిడ్కో ఇళ్లు, కుళాయిలు ఏర్పాటు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.


ప్రస్తుతం కొత్తగా అమలు చేయనున్న క్లాప్ కార్యక్రమం జులై 8 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ 1 నుంచి సేవా రుసుమును ఒక వార్డులో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి వసూలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పింది. వీటితో పాటు ఆస్తి పన్ను, అద్దె గదుల రాబడులు, ఖాళీ స్థలాలపై ట్యాక్స్, అనధికార నిర్మాణాలపై చర్యలు తదితర వాటిపై కౌన్సిల్‌లోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.


పాలకవర్గం సమావేశాలు జరగకపోయినా, అభివృద్ధికి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. అత్యవసర తీర్మానాలపై మేయరు ద్వారా ముందస్తు అనుమతి తీసుకొని పనులు చేయొచ్చని అంటున్నారు. కమిషనర్ పరిధిలో లక్షల వరకు వ్యయం చేసే అధికారం ఉంది. అయితే పూర్తిస్థాయిలో పాలకవర్గం కొలువుదీరితే తప్ప…కార్పొరేషన్ పరిధిలో సమస్యలపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది.