జూరాల ప్రాజెక్ట్‌ జలకళ

 


జూరాల ప్రాజెక్ట్‌ జలకళను సంతరించుకుంది. జూరాలకు వరద నీరు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా అధికారులు నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 20,239 క్యూసెక్కులు ఉండగా.., ఔట్‌ ఫ్లో 7,484 క్యూసెక్కులు ఉంది. మీటర్ల ప్రకారం చూసుకుంటే డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.010 మీటర్లు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 9.459 టీఎంసీలు ఉంది.


ఈ ఏడాది జూన్‌ ఆరంభంలోనే జూరాల నిండింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం, నారాయణపూర్‌-జూరాల మధ్యలో కురిసిన వర్షాలతో మంగళవారం రాత్రి నుంచే వరద ప్రవాహం వచ్చింది. బుధవారం ఉదయం 27వేల 400 క్యూసెక్కులు రాగా, సాయంత్రం ఆరు గంటలకు 18వేల 800 క్యూసెక్కులకు తగ్గింది. అయినప్పటికీ 9.66 టీఎంసీల సామర్థ్యం గల జూరాలలో అప్పటికే నాలుగున్నర టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఒక రోజులోనే పూర్తిస్థాయి మట్టానికి చేరువైంది. సాధారణంగా జులై నెలాఖరుకు నిండుతూ ఉంటుంది.