కరోనా ప్రపంచంలోని నివాసయోగ్య నగరాల జాబితాపై కూడా తీవ్ర ప్రభావమే

 

 కరోనా ప్రపంచంలోని నివాసయోగ్య నగరాల జాబితాపై కూడా తీవ్ర ప్రభావమే చూపింది. ఈసారి ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరా
ల జాబితాను తయారు చేయడంలో కొవిడ్ కట్టడి అనేది కీలక పాత్ర పోషించింది. అందుకే ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న దేశాల్లో ఒకటైన న్యూజిలాండ్‌కు చెందిన ఆక్లాండ్ ఈసారి అత్యంత నివాసయోగ్య నగరంగా నిలిచింది. అదే సమయంలో గత రెండేళ్లుగా టాప్‌లో ఉన్న ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మాత్రం టాప్ టెన్‌లోనూ చోటు దక్కలేదు. అక్కడ కరోనా కేసులు భారీగా నమోదవడమే దీనికి కారణం. ఆ నగరం 12వ స్థానంతో సరిపెట్టుకుంది.


స్థిరత్వం (25 శాతం), ఆరోగ్య సంరక్షణ (20 శాతం), సంస్కృతి, పర్యావరణం (25 శాతం), విద్య (10 శాతం), మౌలిక సదుపాయాలు (20 శాతం).. ఈ ఐదింటినీ ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని నగరాలకు ర్యాంకులు కేటాయించారు. 2020లో కొవిడ్‌ను సమర్థంగా కట్టడి చేసిన ఘనత ఆక్లాండ్‌కు దక్కుతుంది. అదొక్కటే కాకుండా విద్య, సంస్కృతి, పర్యావరణం విషయంలోనూ ఈ నగరానికి మంచి మార్కులే వచ్చాయి. ఈసారి టాప్‌లో ఉన్న నగరాలను చూస్తే వాటిలో చాలా వరకూ కొవిడ్‌ను సమర్థంగా కట్టడి చేసినవే కనిపిస్తాయి.


యురోపియన్ నగరాలు ఈసారి తమ టాప్ స్థానాలను కోల్పోయాయి. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో యురోపియన్ దేశాలే ముందు వరుసలో ఉన్నాయి. ఆస్ట్రియాలో అయితే ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రే తన వల్ల కాదంటూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 90 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో సుమారు 6 లక్షల వరకూ కేసులు నమోదు కావడం గమనార్హం.


ఆక్లాండ్ కాకుండా టాప్ టెన్‌లో ఉన్న నగరాలను చూస్తే.. జపాన్‌కు చెందిన ఒసాకా రెండో స్థానంలో, ఆస్ట్రేలియాలోని అడిలైడ్ మూడు, న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ నాలుగు, జపాన్‌లోని టోక్యో ఐదు, ఆస్ట్రేలియాలోని పెర్త్ ఆరు, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఏడు, జెనీవా ఎనిమిది, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ తొమ్మిది, బ్రిస్బేన్ పదో స్థానంలో ఉన్నాయి.