సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) టర్మ్ 2 పరీక్షల బోర్డు విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెల్పింది. గత ఏడాది జూలై 5 సర్క్యులర్ ప్రకారం.. దేశంలో కోవిడ్-19 మహమ్మారి వల్ల నెలకొన్న అనిశ్చితి కారణంగా బోర్డు పరీక్షలను టర్మ్ 1, టర్మ్ 2 అనే రెండు భాగాలుగా నిర్వహించాలని నిర్ణయించింది. దీని ప్రకారం బోర్డు గత ఏడాది టర్మ్ 1 పరీక్షలను నిర్వహించగా.. ఫలితాలు ఇంకా విడుదలవ్వలేదు. ఇక తాజా ప్రకటన ప్రకారం సీబీఎస్సీ 10, 12వ తరగతుల పరీక్ష లను ఏప్రిల్ 26 నుంచి ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించాలని బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో బోర్డు పరీక్షలు కేటాయించిన పరీక్షా కేంద్రాలలో ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతాయని సిబిఎస్ఇ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ తెలిపారు. శాంపిల్ పేపర్లను ఇప్పటికే బోర్డు అధికారిక వెబ్సైట్ cbse.gov.inలో అప్లోడ్ చేసింది. ప్రశ్నపత్రం నమూనా బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నమూనా ప్రశ్న పత్రాల (Sample papers) మాదిరిగానే ఉంటుంది. గతేడాది మాదిరిగానే విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు రాయనున్నారని, వివరణాత్మక పరీక్షల తేదీలతో కూడిన డేట్ షీట్‌ను త్వరలో విడుదల చేస్తామని భరద్వాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.