ఏపీ సీఎం జగన్ ఈనెల 20వ తేదీన కడప పర్యటన

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 20వ తేదీన ఆదివారం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, డీఆర్వో మాలోల, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కడప నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్‌ కలెక్టర్‌ రామ్మోహన్, డ్వామా, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు యదుభూషణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ నాగరాజు, సీపీఓ వెంకట్రావు, టూరిజం అధికారి రాజశేఖర్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌కుమార్, డీఎస్పీ శివారెడ్డి, సమగ్ర శిక్ష పీడీ ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.