ఈ నెల 21న హైదరాబాద్‌ యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా ‘భీమ్లానాయక్‌’ సినిమా ప్రే రిలీజ్ ఈవెంట్.ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్..

 


పవన్‌కల్యాణ్‌ హీరోగా మలయాళ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌గా రూపొందిన ‘భీమ్లానాయక్‌’ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏపీలో టికెట్‌ రేట్ల సమస్యలు, ఇతర భారీ చిత్రాలకు డేట్స్‌ క్లాష్‌ కాకుండా చూసే క్రమంలో ఇలా.. పలు కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం థియేటర్‌లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఏపీలో టికెట్ల రేట్ల పెంచే జీవో ఇంకా జారీ కానప్పటికీ నిర్మాత ధైర్యంగా సినిమాను విడుదల చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నెల 21న హైదరాబాద్‌ యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అతిథిగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారు. గతంలో రామ్‌చరణ్‌ ‘ధ్రువ’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు కేటీఆర్‌ అతిథిగా హాజరై పవన్‌కల్యాణ్‌ గురించి వేదికపై గొప్పగా మాట్లాడారు. ఈసారి వేదిక ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. 


ఇప్పటికే ఈ చిత్రంలోని విడుదలైన పాటలన్నీ ఒక రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. పాటలతోనే సినిమాకు ఫుల్‌ బజ్‌ ఏర్పడింది. ఇప్పుడంతా ట్రైలర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలుసుకోవాలంటే 21 వరకూ ఆగాల్సిందే. రానా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో పవన్‌ సరసన నిత్యామీనన్‌ నటించగా రానాకు జోడీగా సంయుక్త మీనన్‌ నటించారు. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. తమన్‌ ఈ చిత్రానికి స్వరకర్త.