ఈ నెల 25వ తేదీన 'కేజీఎఫ్-2' సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదల..

 'కేజీఎఫ్-2' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ చేసినట్టు తాజా వార్త ఒకటి వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో యష్ సరసన హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రావు రమేశ్.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి వారు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమాకు నటీ నటులు తమ డబ్బింగ్‌ను పూర్తి చేసేస్తున్నారు. ఇక 'కేజీఎఫ్-2' ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సరికొత్త రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను వదిలేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. దీని కోసం ఈ నెల 25వ తేదీని ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 'కేజీఎఫ్-1' కి సీక్వెల్ సినిమాగా ఇది రూపొందుతోంది.