అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మల జాతర ..

 సమ్మక్క జాతర ప్రధాన వేదిక మేడారమే అయినా వరంగల్… కరీంనగర్…ఆదిలాబాద్ తూర్పు జిల్లా.. ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఈ జాతరను జరుపుకుంటారు. అయితే, ప్రధాన జాతర సమయంలోనే ఈ ఉపజాతరలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఆదివాసీయేతర ప్రాంతాల్లోనే జరుగుతుండడం గమనార్హం. వరంగల్ జిల్లా అగ్రంపహాడ్‌లో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మల జాతర జరుగుతుంది. మేడారం జాతరకే అధిక ప్రాధాన్యం. తర్వాత వరంగల్ నగరశివారులోని ఉర్సుగుట్ట వద్ద అమ్మవారిపేటలో సమ్మక్క జాతర కూడా ఘనంగా జరుగుతుంది. 1977 నుంచి జరుగుతున్న ఈ జాతరకు విశేషంగా భక్తులు తరలివస్తారు.ఇక వరంగల్ జిల్లాలో గుర్రంపేట, మద్దిమేడారం, అమ్మవారిపేట, బొంతగట్టు, రుద్రగూడెం, వెంచరామి, నాగరాజుపల్లి, జోగంపల్లి-పెద్దకొడెపాక, లింగంపల్లి, ఇప్పగూడెం, తాటికొండ, ఫతేపూర్, శ్రీపతిపల్లి, కొండాపూర్, కమలాపూర్, తిరుమలగిరి, కమలాపూర్, గబ్బిలమడుగు, కూటిగల్, కంఠాత్మకూరు, పులిగిల్లి, ధర్మారం, ముల్కలపల్లిల్లో జాతరలు జరుగుతాయి.


కరీంనగర్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో అనుబంధ జాతరలు జరుగుతాయి. శంకరపట్నం మండలకేంద్రం, చొప్పదండి మండలం గుమ్లాపూర్, రాగంపేట, రామగుండం మండలం గోలివాడ, హుజురాబాద్‌లోని రంగనాయకుల గుట్ట, వీణవంక మండలం పోతిడ్డిపేట, కమలాపురం మండలకేంద్రం, కన్నూరు, ఎల్కతుర్తి మండలకేంవూదాలతోపాటు సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల, పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, హుజురాబాద్ మండలం జూపాక గ్రామాల్లో జాతరలు జరుగుతాయి.ఇక సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని గంగొడ్డున వైభవంగా జాతర జరుగుతుంది. దీని ఆసక్తికర విషయమేంటంటే.. సింగరేణి బొగ్గు గనులున్న గోదావరిఖని, రామగుండం, మణుగూరు ప్రాంతాల్లోని కార్మికులు మేడారం జాతర వచ్చిందంటే పది పదిహేను రోజులు సెలవులు పెట్టి వెళ్లేవారు. సిబ్బంది కొరతతో సుమారు నాలుగు నుంచి పది లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుండేది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి సింగరేణిలోనే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. 1998 నుంచి సింగరేణి సంస్థ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరీ ఈ జాతరను నిర్వహిస్తోంది.ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని గోదావరి ఒడ్డున, సీసీసీలో, రెబ్బన మండలం గంగాపూర్, దేవులగూడ, బెల్లంపల్లి మండలం చిన్నబుగ్గ, ఖమ్మం జిల్లా మణుగూరులోని తోగ్గూడెం, ఇల్లందులోని సంజయ్‌నగర్, బొజ్జాయిగూడెం, కొత్తగూడెంలలో కూడా సమ్మక్క సారలమ్మ పేరల జాతరలను జరుపుతున్నారు.


మేడారం జాతరలో ప్రతీక్షణం మధురానుభూతిని మిగులుస్తుంది. జాతరకు వచ్చిన భక్తులందరూ తనివితీరా తల్లులనుచూసుకుని మొక్కలు సమర్పించి తిరిగి వెళ్లడం ఓ అందమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో జరిగే అతి పెద్ద గిరిజన జాతర మేడారం కాగా.. ఈ జాతరకు అనుబంధంగా ఉన్న జాతరలు.. జాతరలో జరిగే వ్యాపారం, ఇతరత్రా విశేషాలు మరెక్కడా కనిపించవు. అందుకే మేడారం రెండేళ్లకోసారి వచ్చినా.. ప్రతీ మదిని తట్టి లేపుతుంది. ప్రతీ ఒక్కరిలో జానపద ఆచారాన్ని ప్రతిబింబిస్తుంది.