టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అరెస్ట్..

 టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రేవంత్ నిలదీశారు.


కాగా...సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా మూడు రోజుల పాటు జరపడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రేవంత్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటి వరకు 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. నోటిఫికేషన్లు రాక, నిరుద్యోగ భృతి లేక చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అటు రైతులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు. వారిని ఆదుకోకుండా... ఏం సాధించారని ఇంత గొప్పగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నిస్తూ...జన్మదిన వేడుకలకు కౌంటర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.


అందులో భాగంగా ఈరోజు 11 గంటలకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాడిదకు జన్మదిన వేడుకల పేరిట ఓ నిరసన కార్యక్రమాన్ని గాంధీభవన్‌ వద్ద ఏర్పాటు చేశారు. ఆందోళనలో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఏ స్టేషన్‌ను తరలించలేదని, నగర రోడ్లపైనే తిప్పుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల వైఖరి పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.