మొబైల్‌ యూజర్లకు మరోసారి చార్జీల షాక్..?

 
 

మొబైల్‌ యూజర్లకు ఈ సంవత్సరం మరోసారి చార్జీల షాక్  తగిలే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్‌లో టెలికం సంస్థలు ఎయిర్‌టెల్‌ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea - Vi ), రిలయన్స్ జియో (Reliance Jio) అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెంచాయి. మొత్తంగా 25 శాతం వరకు ధరలు పెరిగాయి. దీంతో మొబైల్‌ యూజర్లపై అదనపు చార్జీల భారం పడింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU)ను మెరుగుపరుచుకునేందుకు ప్లాన్‌ల ధరలను పెంచామని సంస్థలన్నీ కారణాలు చెప్పాయి. అయితే 2022లో మొబైల్‌ యూజర్లకు మరోసారి చార్జీల షాక్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే Airtel, Vodafone Idea ఆ దిశగా సంకేతాలు ఇచ్చాయి. అసలు ఆ కంపెనీల నుంచి వచ్చిన సమాచారం ఏంటి..? ఏం చెప్పాయో చూడండి.


మొబైల్‌ యూజర్లకు మళ్లీ భారీ షాక్ తప్పదా..?


ఎయిర్‌టెల్‌ ఇలా..

2022లో ఎప్పుడైనా టారిఫ్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌టెల్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తాజాగా వ్యాఖ్యానించారు. 2021 డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికం ఫలితాలను ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. నవంబర్‌లో పెంచిన ప్లాన్‌ల ధరలు, గూగుల్ పెట్టుబడులు పెట్టడం వంటి పరిణామాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. అయితే ARPUను రూ.200లకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు ఆ ఉన్నతాధికారి వెల్లడించారు.

2021 నవంబర్‌లో ఎయిర్‌టెల్‌ ముందుగా అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరను 18 నుంచి 25 శాతం వరకు పెంచింది. దీంతో ఆ సంస్థ ARPU రూ.163కు చేరింది. అయితే దీన్ని మరింత పెంచుకునేందుకు ఆ సంస్థ 2022లోనూ ధరను పెంచే యోచనలో ఉంది.

“2022లో ఏదో ఒక సమయంలో టారిఫ్ ధరలు పెరుగుతాయని నేను అంచనా వేస్తున్నా. అయితే తర్వాతి 3-4 నెలల్లో ఉండకపోవచ్చు. ఆ తర్వాతే ధర పెంపు ఉండే అవకాశం ఉంది” అని భారతి ఎయిర్‌టెల్‌ భారత ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. ఎర్నింగ్ కాల్ సందర్భంగా ఎదురైన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. దీంతో ఎయిర్‌టెల్‌ దాదాపు ఈ ఏడాది మరోసారి ప్లాన్‌ల ధరలను పెంచడం ఖాయంగానే కనిపిస్తోంది.