‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కు ఛీఫ్ గెస్ట్ గా హాలీవుడ్ స్టార్...?

 


కరోనా థర్డ్ వేవ్ ముగియడంతో భారీ చిత్రాలన్నీ ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్స్‌‌లోనే బరిలోకి దిగుతున్నాయి. దానికి ముందుగా పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రం శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మార్చ్ 11న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా హడావిడి ముగిశాకా.. జాతీయ స్థాయిలో మంచి హైప్ క్రియేట్ అయిన రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సందడి మొదలు కాబోతోంది. మార్చ్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటుండగా.. ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా, సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలాగే... పలువురు బ్రిటీష్ స్టార్స్ నటిస్తున్నారు. 


నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈ ఏడాది జనవరి 7న రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రమోషన్స్ కోసం ఏకంగా రూ. 20 కోట్లు వరకూ ఖర్చుపెట్టారు. కరోనా కారణంగా అదంతా వృధా అయింది. చివరి క్షణాల్లో సినిమా వాయిదా పడడంతో ప్రమోషన్స్ కు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాజాగా ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడంతో మళ్ళీ ప్రమోషన్స్ మొదలు పెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు. మార్చ్ 1 నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి మళ్ళీ ప్రమోషన్స్ బిగిన్ కానున్నాయి. దీనికోసం రాజమౌళి భారీ స్కెచ్ ను రెడీ చేశారట. టీవీ ఇంర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్స్ మొదలు పెట్టబోతున్నారు. అంతేకాదు ఈ సారి హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా చేయబోతున్నారట. ఇంతకు ముందు ఇక్కడ ఈ సినిమాకి ఈవెంటే జరగలేదు. అంతేకాదు దుబాయ్ లో మార్చ్ 15న భారీ ఈవెంట్ చేయబోతున్నారని టాక్.


ఇక ఈ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ ను రంగంలోకి దింపబోతున్నారని వార్తలొస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి క్రేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే టామ్ క్రూజ్ ను గెస్ట్ గా ఆహ్వానించాలని చూస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ కు భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.