మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. తమ అభిమాన హీరోను వెండితెరపై చూడక రెండేళ్లు అవుతోన్న నేపథ్యంలో మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను మే 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఆదివారం సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ ‘కళావతి’ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆయితే ఈ పాటను అధికారికంగా విడుదల చేసే కంటే ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో చిత్రయూనిట్ ఒకరోజు ముందే పాటను అధికారికంగా విడుదల చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో సాంగ్ హల్చల్ చేస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో గత రికార్డులను తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కళావతి పాట కేవలం 24 గంటల్లోనే 16 మిలియన్లకుపైగా వ్యూస్, 8 లక్షలకుపైగా లైక్స్‌తో సరికొత్త రికార్డు నెలకొలిపింది.
ఇలా కేవలం 24 గంట్లలో ఈ పాట సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన తొలి పాటగా, టాలీవుడ్లో ఒకరోజులో అత్యధిక లైక్స్ దక్కించుకున్న వీడియోగా సరికొత్త రికార్డును అందుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అలపించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.