విశాఖలో ఘనంగా జరిగినఅత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ..

 విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఘనంగా జరిగింది. నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందుకు ఘనంగా గౌరవ వందనం చేశారు. PFR-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాదళాలను, యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు, 10 వేల మంది సిబ్బందితో కూడిన జలాంతర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తిసామర్ధ్యాలను రివ్యూ చేశారు.


భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న దశలో జరిగిన ఈ 12వ ఫ్లీట్ రివ్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ..."కోవిడ్ -19" మహమ్మారి సమయంలో నేవీ పాత్రను ప్రశంసించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారని అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించారు." అని అన్నారు.


అంతేకాదు భారత నౌకాదళం నిరంతర నిఘా, సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని చెప్పారు. ఈ మేరకు సాయుధ దళాల సుప్రీం కమాండర్ మాట్లాడుతూ.. "నౌకలు, విమానాలు, జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించిందన్నారు. పైగా ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించింది." అని చెప్పారు.


ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం, ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్‌ స్పష్టం చేశారు. అంతేకాదు భారత నావికాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోంది 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో ముందంజలో ఉందని కూడా అన్నారు. భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. అంతేగాక 1971 యుద్ధ సమయంలో విశాఖపట్నం నగరం అద్భుతమైన సహకారం అందించిందని చెప్పారు.