యూకే లో ‘‘లస్సా’’ వైరస్‌ కలకలం...

 ఒమైక్రాన్‌ ఉధృతి తగ్గి.. కొవిడ్‌ కల్లోలం నుంచి బయటపడుతున్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో.. ‘‘లస్సా’’ రూపంలో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు మూడు కేసులు నమోదు కాగా, బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందారు. వీరందరూ ఆఫ్రికా పశ్చిమ దేశాల ప్రయాణ చరిత్ర ఉన్నవారే కావడం గమనార్హం. లస్సా ప్రమాదకర అంటువ్యాధేనని.. పదేళ్ల పైగా విరామం తర్వాత దేశంలో ఈ వైరస్‌ కేసులు వెలుగుచూశాయని యూకే ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పర్యవేక్షిస్తోంది.


కాగా, అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గతంలో తెలిపినదాని ప్రకారం లస్సా జ్వరం తీవ్రమైన వైరల్‌ ఇన్ఫెక్షన్‌. చిట్టెలుకల్లోని ఓ జాతి అయిన ‘‘మల్టీమమ్మెత్‌ ర్యాట్‌’’ నుంచి వ్యాపిస్తుంది. దీని బారినపడిన ఎలుకలు జీవితాంతం మూత్రం ద్వారా జీవితాంతం వైర్‌సను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విసర్జితాలు పడిన వస్తువులను తాకడం ద్వారా మనుషులు వైరస్‌ బారినపడే ప్రమాదం ఉంది. ఇలాంటివారి నుంచి వేరే వారికీ వ్యాపిస్తుంది. ఇది అరెనావిరిడే కుటుంబానికి చెందిన సింగిల్‌ స్ట్రాండెడ్‌ ఆర్‌ఎన్‌ఏ వైరస్‌. పశ్చిమ ఆఫ్రికా దేశాలైన సియెర్రా లియోన్‌, లైబీరియా, గినియా, నైజీరియాల్లో గతంలో లస్సా కేసులు నమోదయ్యాయి.


అయితే, ఆ దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎండెమిక్‌ దశకు చేరింది. కాగా, లస్సా వైర్‌సకు గురైన రోగిలో వారం నుంచి మూడు వారాల్లో లక్షణాలు బయటపడతాయి. 80శాతం మందిలో లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. మిగిలిన 20 శాతం మందిలో మాత్రం చిగుళ్లు, కళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతూ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు, తరచూ వాంతులు, ముఖం వాపు, ఛాతీ, వెన్ను, పొట్టలో నొప్పి, విభ్రమ లక్షణాలు కనిపిస్తాయి. వినికిడి శక్తి కోల్పోవడం, వణు కు, మెదడువాపు సహా నాడీ సంబంధ సమస్యలు వస్తాయని సీడీసీ తెలిపింది. కాగా, లస్సా జ్వరం సోకినవారిలో 1 శాతం మరణాలకు అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అదే లక్షణాలు తీవ్రంగా ఉండి ఆస్పత్రు ల్లో చేరిన కేసుల్లో 15ు మరణాలున్నట్లు చెప్పింది.