తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

 



తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై బీజేపీ లీడర్ విజయశాంతి దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం  తన భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమని కోర్టు తెలిపింది. భూముల విక్రయంలో ప్రభుత్వం టెండర్లు, ఈ వేలం వంటి పారదర్శక విధానాలను పాటించాలంటూ.. ఈ వ్యాజ్యంపై విచారణను ముగించింది. ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని బీజేపీ లీడర్ విజయశాంతి గతంలో విమర్శించారు. భూములు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని భూముల వేలం కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ను​ రద్దు చేయాలని ఆమె కోరారు. ప్రభుత్వం తన ఉత్తర్వులకు తానే విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్​లో పేర్కొన్నారు.


ఎకరానికి కనీస వేలం రూ.25 కోట్లు..


భూముల విక్రయం ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. మొదటి విడతలో హెచ్ఎండీఏ, టీఎస్- ఐఐసీకి చెందిన 64.93 ఎకరాల భూమిని విక్రయించనుంది. హెచ్ఎండీఏకు చెందిన కోకాపేటలోని 49.92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 8 ప్లాట్లను విక్రయించనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ టీఎస్-ఐఐసీకి హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్ లేఅవుట్‌లోని 15.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 5 ప్లాట్లకు వేలం నిర్వహించనుంది. ఎకరానికి కనీస వేలం ధర 25 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం.. 20 లక్షల చొప్పుల వేలం పెంచుకోవచ్చని ప్రకటించింది.


కోకాపేట, ఖానామెట్ భూముల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం, గృహనిర్మాణ సంస్థ వద్ద భూములు, ఇళ్లను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని గత మంత్రివర్గ సమావేశంలో సర్కార్ నిర్ణయించింది. గతంలో గృహనిర్మాణ సంస్థ విక్రయించిన భూములకు సంబంధించిన పన్నుల సమస్యను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించుకోవాలన్న సీఎం కేసీఆర్​.. వీలైనంత త్వరగా భూముల అమ్మకం ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.