తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాల ప‌రిష్కారంపై కేంద్రం ఫోక‌స్..

 తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాల ప‌రిష్కారంపై కేంద్రం ఫోక‌స్ పెట్టింది. హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిస‌భ్య క‌మిటీ మొద‌టి స‌మావేశం గురువారం జ‌రుగుతుంది. ఉభ‌య రాష్ట్రల మ‌ధ్య నెల‌కొన్న ఆర్థిక ప‌ర‌మైన ఐదు అంశాల‌పై క‌మిటీ చ‌ర్చించ‌నుంది. క‌మిటీ ద్వారా స‌మ‌స్యలు కొలిక్కి వ‌స్తాయ‌ని ఏపీ స‌ర్కార్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న జ‌రిగి ఎనిమిదేళ్లు కావ‌స్తుంది. అయినా చాలా అంశాల్లో రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్యలు కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభజన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రహోం శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఈనెల 8న కమిటీ నియమించింది కేంద్రం. మరికాసేపట్లోనే ఈ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. అత్యంత కీలకమైన 5 అంశాలను అజెండాలో చేర్చారు. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన, విద్యుత్‌ బకాయిలు, పన్నుల వ్యత్యాసాల తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, పౌర సరఫరా సంస్థల రుణాల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు.


ఇక తెలంగాణ డిస్కంల నుంచి రూ. 3,442 కోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ జెన్‌కో వాదిస్తోంది. హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. కానీ ఏపీ విద్యుత్ సంస్థలే తమకు రూ.12,111 కోట్లు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదిస్తున్నాయి. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన 250 ఎకరాల భూమి, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన రూ. 495 కోట్ల నిధులు, హైకోర్టు, రాజ్‌ భవన్‌ వంటి ఉమ్మడి సంస్థల నిర్వహణకు చేసిన ఖర్చు, నిర్మాణంలో ఉన్న భవనాల్లో వాటా, ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ తీసుకున్న రుణాల చెల్లింపుల్లో వాటా .. ఇలా పలు లెక్కలు తేలాల్సి ఉంది. అయితే త్రిసభ్య కమిటీ తొలి భేటీకి ముందే ఓ రచ్చ రాజుకుంది.. 9 అంశాల అజెండాతో ఈనెల 12న రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర హోంశాఖ. అందులో ప్రత్యేకహోదా, లోటు భర్తీ వంటి అంశాలున్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రత్యేక హోదాపై ఆశలు చిగురించాయి. కానీ ఆ తర్వాత హోదా, లోటు భర్తీతో పాటు మరో 4 అంశాలను తొలగించి.. ఐదు అంశాలతో కొత్త అజెండా సిద్ధం చేసింది. దీనిపై ఏపీ అసంతృప్తితో ఉంది. అటు తెలంగాణ కూడా తాము చెప్పిన అంశాలేవీ అజెండాలో చేర్చలేదని గుర్రుగా ఉంది. అయితే రేపటి సమావేశంతోనే సమస్యలు పరిష్కారం కావని.. ప్రతి నెలా మీటింగ్‌లు నిర్వహిస్తామని చెబుతోంది కేంద్ర హోంశాఖ.