ఐపిఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ..

 


లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అనే రెండు కొత్త ఫ్రాంఛైజీలతో సహా 10 జట్లు ఐపీఎల్ 2022మెగా వేలంలో ప్రపంచ క్రికెట్‌లోని కీలక ప్లేయర్లతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 13 వరకు బెంగళూరులో జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం 590 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు. వేలానికి ముందు, 2016 ఛాంపియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ అనే ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో తమ జట్టును బలోపేతం చేయడానికి ఫుల్ ప్లాన్‌లో ఉంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా:


కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు) ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు)


SRH పర్స్‌లో ఇంకెంత ఉంది: రూ. 68 కోట్లు


ఐపీఎల్ 2022 వేలం(IPL 2022 Auction)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ 5గురు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది.


1. జాసన్ రాయ్ (గరిష్టంగా రూ. 5 కోట్లు)


డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో ఇద్దరినీ విడుదల చేసిన తర్వాత, SRH టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల ఆటగాడి కోసం ఎదురుచూస్తోంది. గత సీజన్‌లో ఇంగ్లండ్‌కు చెందిన జాసన్ రాయ్ కీలకమైన ఎంపిక కావచ్చు. తొలి ఓవర్లలో జాసన్ రాయ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లను భయపెట్టడంలో ముందుంటాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తుంది.


2. శిఖర్ ధావన్ (గరిష్టంగా రూ. 5 కోట్లు)


SRH బ్యాటింగ్ యూనిట్‌లో అనుభవం తక్కువగా ఉంది. శిఖర్ ధావన్ ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని బలోపేతం చేయడంలో సహాయపడగలడు. దీంతో ధావన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ విశ్వప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.


3. క్వింటన్ డి కాక్ (గరిష్టంగా రూ. 7 కోట్లు)


దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డి కాక్‌ను అన్ని ఫ్రాంచైజీలు కన్నేస్తాయనడంలో సందేహం లేదు. ముంబై ఇండియన్స్ విడుదల చేసిన తర్వాత, ప్రతి జట్టు జాబితాలో డి కాక్ పేరు ఉంటుంది. ఓపెనర్‌గా భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో డికాక్ పేరుగాంచాడు. అంతేకాకుండా వికెట్ కీపింగ్ కూడా చేయడం అతనికి అదనపు అర్హతను అందిచాయి. SRH ఖచ్చితంగా డికాక్ సేవలను పొందేలా చూస్తుందనడంలో సందేహం లేదు.


4. యుజ్వేంద్ర చాహల్ (గరిష్టంగా రూ. 6 కోట్లు)


రషీద్ ఖాన్ SRHతో విడిపోయి గుజరాత్ టైటాన్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో పని చేయగల వ్యక్తిని పొందాలని SRH తహతహలాడుతోంది. ప్రస్తుతం RCB చాహల్‌ను విడుదల చేయడంలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ స్థానాన్ని భర్తి చేసేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌, ఈ ఆటగాడిపై ఫోకస్ చేసింది.


5. జోష్ హేజిల్‌వుడ్ (గరిష్టంగా రూ. 6 కోట్లు)


జోష్ హేజిల్‌వుడ్ CSK టైటిల్ విజయంలో, అలాగే గత సంవత్సరం ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హేజిల్‌వుడ్ సరైన లెంగ్త్‌లలో బౌలింగ్ చేయడంలో నైపుణ్యం ఉన్న ఆటగాడు. కీలక సమయంలో వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు.


కాగా, గత సీజన్‌లో పేలవ ఆటతీరుతో ప్లాప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఏడాది కీలక ఆటగాళ్లను ఎంచుకుని ట్రోఫీ గెలుచుకోవాలని కోరుకుంటుంది. ఈ మేరకు కొత్త జెర్సీతో రంగంలోకి దిగనుంది. డేవిడ్ వార్నర్ విషయంలో ఎన్నో విమర్శలపాలైన ఎస్‌ఆర్‌హెచ్.. ఆ వివాదాన్ని భర్తీ చేసేందుకు అన్ని రంగాల్లో మెరుగైన ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటుంది. ఇన్ని మార్పులతో బరిలోకి దిగబోతున్న ఎస్‌ఆర్‌హెచ్‌.. రాణిస్తుందో లేదో చూడాలి.