డిఫరెంట్ స్టైల్ తో చరణ్, శంకర్ సినిమా..?

 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తాజా చిత్రాలు ‘ఆర్.ఆర్.ఆర్, ఆచార్య’ రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. వచ్చే నెల, ఆపైనెల ఈ రెండు సినిమాలూ విడుదల కాబోతున్నాయి. ఆలోపే చెర్రీ తన 15వ చిత్రాన్ని శంకర్ దర్వకత్వంలో మొదలు పెట్టేశాడు. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లో ఇది 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. తాజా షెడ్యూల్ ఇటీవలే రాజమండ్రిలో మొదలైంది. ఈ సినిమాలో చరణ్ మేకోవర్ అభిమానులను మెప్పిస్తుందని చెబుతున్నారు. హీరోల్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు శంకర్ ఎక్స్పెర్ట్ అని తెలిసిందే. ‘అపరిచితుడు, ఐ’ చిత్రాల్లో విక్రమ్, ‘రోబో’ సిరీస్‌లో రజనీకాంత్ మేకోవర్స్ ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాయో తెలిసిందే. RC 15 లో చరణ్ లుక్స్ అంతకు మించి అనే రేంజ్ లో ఉండబోతున్నాయట. ఇందులో చరణ్ మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. ఒకటి నార్మల్ లుక్, మరొకటి ఐఏయస్ ఆఫీసర్ అయితే.. మరొకటి చీఫ్ మినిస్టర్ గెటప్ అని తెలుస్తోంది. 

‘ఒకే ఒక్కడు’ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఛీఫ్ మినిస్టర్‌గా స్టైలిష్ లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. RC 15 లో చెర్రీ ఛీఫ్ మినిస్టర్ లుక్ కూడా ఇంచుమించు అలాగే ఉండబోతోందట. ఈ లుక్స్ పై శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన చరణ్ పిక్స్.. ఈ సినిమా కోసమేననే వార్తలొస్తున్నాయి. ఒక ఐఏయస్ అధికారి ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కష్టపడి సీయం అవుతాడట. అప్పుడు అతడికి ఎదురయ్యే సవాళ్లు, ప్రతికూలతల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే వెరైటీ టైటిల్ ను పరిశీలిస్తున్నారట. సినారెకి జ్ఞానపీఠ్ పురస్కారం తెచ్చిపెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ పలువురికి సుపరిచితమే. ఈ టైటిల్ ఈ సినిమాకి అన్నివిధాల యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారట శంకర్ టీమ్.  

కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న RC15లో ఇంకా జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాకా.. చెర్రీ గౌతమ్ తిన్ననూరి చిత్రానికి షిఫ్ట్ అవుతాడట. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈసినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాలోని చెర్రీ మేకోవర్ ఏ స్థాయిలో అభిమానుల్ని మెప్పిస్తుందో చూడాలి.