ఈ సంవత్సరం కూడా ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేనట్టే..

 ఈ సంవత్సరం కూడా ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేనట్టేనని తెలుస్తోంది. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో అందరినీ పాస్‌ చేయడం, కరోనా నేపథ్యంలో తరగతులు సరిగ్గా జరగకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి మే 10 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అనంతరం జూన్‌లో ఎంసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని అమలుచేయాలా? వద్దా? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. గడచిన రెండేళ్లుగా ఎంసెట్‌ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించి, ఇంజనీరింగ్‌ సీట్లను భర్తీ చేస్తున్నారు. కరోనా కారణంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలను రద్దు చేయడంతో ఎంసెట్‌లో ఆ మేరకు వెయిటేజీ విధానాన్ని కూడా రద్దు చేశారు.


అయితే... ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించారు. ఇందులో ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేశారు. సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. పరీక్షలు జరుగుతున్నందున ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీని అమలుపరిచినా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తవనే వాదన ఉంది. అయితే వెయిటేజీ విధానం అమలు చేస్తే... ఫస్టియర్‌ పరీక్షల్లో కనీస మార్కులతో పాస్‌ చేసినవారికి ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం ఉంది. అలాగే కరోనా కారణంగా సెకండియర్‌ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు సరిగా జరగలేదు. ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షల్లో విద్యార్థులు పూర్తి స్థాయిలో మార్కులు సాధిస్తారా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని వెయిటేజీని అమలు చేయకూడదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.


త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి చెప్పారు. సెట్‌ కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా, అర్హత మార్కుల అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎంసెట్‌ ద్వారా ర్యాంకు పొందిన అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో చేరాలంటే... ఇంటర్మీడియట్‌లో కనీసం 45 శాతం మార్కులను సాధించాలి. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులైతే 40 శాతం, ఇతర వర్గాల అభ్యర్థులు 45 శాతం మార్కులు వస్తేనే ఇంజనీరింగ్‌లో చేరడానికి అర్హులవుతారు. అయితే రెండేళ్ల నుంచి పరీక్షలు రద్దు కావడంతో ఈ నిబంధనను ఎత్తేశారు. ఈ ఏడాది దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.