త్వరలోనే బాహుబలి పార్ట్‌3 సినిమా...

 


తెలుగు సినిమా సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి సృష్టి ఈ చిత్రం. ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ కీలక పాత్రధారులుగా రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డులు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘బాహుబలి3’ కూడా రానుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ‘రాధేశ్యామ్‌’ సినిమా ప్రమోషన్‌ కోసం మీడియా ముందుకొచ్చిన ప్రభాస్‌ ముందు ప్రస్తావించగా ‘‘పార్ట్‌3 గురించి నాకూ ఏమీ తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు’’ అని హింట్‌ ఇచ్చారు. 

తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘బాహుబలి’, ‘బాహుబలి–2’ సినిమాలతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. మీ నుంచి ‘బాహుబలి–3’ చిత్రాన్ని ఆశించవచ్చా? అని అడగ్గా ‘‘తప్పకుండా ఆశించవచ్చు. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు తదుపరి ‘బాహుబలి’ చిత్రంలో చూపించనున్నాం. దీనికి సంబంధించి వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. అయితే దీనికి కాస్త సమయం పట్టొచ్చు. మహోన్నత మాహిష్మతి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తర్వాత మహేశ్‌తో సినిమా చేయబోతున్నా. ఈ కథకు సంబంఽధించిన పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం నా దృష్టి అంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పైనే ఉంది. ఈ విడుదలయ్యాక ప్రశాంతంగా మహేశ్‌ సినిమాపై దృష్టి పెడతా’’ అని రాజమౌళి చెప్పారు. దీనితో సినీ ప్రియులు ఆనందంతో సోషల్‌ మీడియాలో ‘బాహుబలి’ చిత్రాన్ని ట్రెండ్‌ చేస్తున్నారు.