పోలవరం ప్రాజెక్టులో కీలకమైన 48 రేడియల్‌ గేట్ల అమరిక పని పూర్తకావొచ్చింది.

 


పోలవరం ప్రాజెక్టులో కీలకమైన 48 రేడియల్‌ గేట్ల అమరిక పని పూర్తకావొచ్చింది. దాదాపు రెండేళ్ల క్రితం రేడియల్‌ గేట్ల పనులు ప్రారంభించినా వరదలు, కరోనా, వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణాల మధ్య ఆలస్యం కావడంతో 48 గేట్లకు గానూ 42 గేట్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేశారు. నేడు మరో 6 గేట్ల అమరిక పూర్తికావడంతో పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే పనులు కీలక ఘట్టానికి చేరుకున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే రేడియల్‌ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్‌ సిలిండర్లకు 84 సిలిండర్లు అమర్చారు. రేడియల్‌ గేట్లు పనిచేయడానికి అవసరమయ్యే 24 పవర్‌ప్యాక్‌ సెట్ల అమరిక పూర్తయ్యింది. 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు పనులు వేగవంతం చేశారు. ఈ పనులు పూర్తయితేనే గేట్లు ఎగువ దిగువకు ఎత్తడానికి వీలవుతుంది. గేట్లను ఎత్తిదించేందుకు అవరసరమయ్యే 24 పవర్‌ ప్యాక్‌ సెట్లు అమరిక పూర్తయ్యింది. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులలో గేట్ల అమరిక ప్రక్రియలో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ముందడుగు వేసినట్లయింది.