దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం..

 


దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపోరాలోని చార్సూ గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ధృవీకరించారు.మరణించిన ఉగ్రవాది ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందని ఐజీ చెప్పారు. చార్సూ గ్రామంలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారం ఆధారంగా భద్రతా దళాల ఉమ్మడి బృందం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించిందని కశ్మీర్ పోలీసు అధికారి చెప్పారు. పోలీసు బృందం అనుమానిత స్థలాన్ని చుట్టుముట్టడంతో, దాక్కున్న ఉగ్రవాది తమపై కాల్పులు జరిపాడని, దీంతో తాము కాల్పులు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. 


చార్సూ గ్రామంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగిస్తున్నారు. కశ్మీర్‌లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, పారామిలటరీ బలగాల సంయుక్త బృందాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.‘‘ఈ ఏడాదిలో ఇది 21వ ఎన్‌కౌంటర్ కాగా ఇప్పటి వరకు 36 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 20 మందికి పైగా ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నాం’’ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.