కేంద్రంపై యుద్ధానికి ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం..

 


కేంద్రంపై యుద్ధానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ మంత్రుల బృందం దేశ రాజధాని హస్తిన బాటపడుతున్నారు.ఈ సాయంత్రం 4గంటలకు ఢిల్లీకి మంత్రులు హరీష్‌రావు,పువ్వాడ అజయ్‌, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ వెళ్లబోతున్నారు. ఇప్పటికీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్ వ్యూహంతో తెలంగాణ మంత్రులందరూ ఢిల్లీకే వెళ్లబోతున్నది ఓ టాపిక్ అయితే.. అంతకంటే ముందే తెలంగాణ బీజేపీ ఎంపీలు, నేతలు ఢిల్లీకి చేరారు. నిన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ని కలిశారు. వరివార్‌పై కేసీఆర్ ప్రయత్నాలను ఆయనకు వివరించి తెలంగాణ సీఎం వ్యూహాలకు ప్రతివ్యూహాలను అమలు చేసే పనిలో ఉన్నారు.


కేంద్రంతో వరి వార్‌కి రెడీ అయ్యారు సీఎం కేసీఆర్‌. యాసింగిలో కేంద్రం వడ్లు కొనాల్సిందే..ఈ ఒకే ఒక్క నినాదంతో ఇవాళ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తోంది. ధాన్యం కొనుగోలు చేయించడమే లక్ష్యంగా ఇప్పటికే రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేసింది. ఇప్పుడు మరోసారి విఙ్ఞప్తి చేయబోతోంది. సరైన స్పందన లేకుంటే ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. యాసంగి సీజన్‌లో వరి కోతలు అక్కడక్కడా మొదలయ్యాయి. దీంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం మార్కెట్లోకి రాకముందే కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరేంటో తేల్చుకోవాలని డిసైడ్ అయింది.


నిరంజన్‌రెడ్డి, గంగుల, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, పువ్వాడ అజయ్‌లతో కూడిన మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలు కూడా గోయల్‌తో భేటీకానున్నారు. యాసంగి ధాన్యం కోనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకురావడమే భేటీల లక్ష్యంగా కనిపిస్తోంది.


యాసంగిలో రాష్ట్రంలో 70 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. ఇప్పటికే కొన్నిచోట్ల వరికోతలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ ఫస్ట్‌ వీక్‌ కల్లా అన్ని ప్రాంతాల్లో ముమ్మరం కానున్నాయి. ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలనీ సూచించింది.


ఎవరేం చెప్పినా తెలంగాణలోని రైతులు మాత్రం 35.84 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొనకపోతే ధాన్యాన్ని విక్రయించడం ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్ల కొనుగోలు విషయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఉద్యమానికి సిద్ధమంటోంది కేసీఆర్‌ సర్కార్.