ఏపీ లో పెరగనున్న విద్యుత్ ఛార్జీల ధరలు..

 


నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్.. ఇలా వివిధ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలపై మరో ధరల భారం పడనుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల ధరలు పెరగనున్నాయి.

ఛార్జీలను పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 13 శ్లాబ్‌లను 6 శ్లాబ్‌లకు కుదించాలని డిస్కంలు నిర్ణయించాయి. కొత్త టారిఫ్‌పై ఈ నెల 30న ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులు(Orders) జారీచేసే అవకాశం ఉంది. పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ప్రభావితమయ్యే శ్లాబ్‌లపై యూనిట్‌కు 20 పైసల నుంచి రూ.1.40 వరకు భారం పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలో (APERC) ప్రతిపాదనలు చేశాయి. కొత్త ఛార్జీలు ఏప్రిల్(April) లోనే అమలు చేయాల్సి ఉండగా.. ట్రూ అప్ ఛార్జీలు పెంచాల్సి ఉన్నందున భారం పెరుగుతుందని వాయిదా వేశారు. డిస్కంల ప్రతిపాదనను ఏపీఈఆర్‌సీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రకారం 2022 ఏప్రిల్‌ నుంచి జులై వరకు పాత టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ ఛార్జీలను వసూలు డిస్కంలు వసూలు చేయనున్నాయి.


2022 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు శ్లాబ్‌లను తగ్గించి, ఫుల్‌కాస్ట్‌ టారిఫ్‌ ప్రకారం ఛార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించాయి. ఇందులో గృహ వినియోగదారులను ఏ, బీ కేటగిరీలకు కుదించింది. నెల వినియోగం 75 యూనిట్లలోపున్న వారిని ఏ కేటగిరీలో, అంతకుమించి వినియోగం ఉన్నవారిని బీ కేటగిరీలో ఉంచింది. కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల ప్రకారం ఏ- కేటగిరీలో 0-30 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.1.45, 31-75 యూనిట్ల వరకు వినియోగిస్తే యూనిట్ కు రూ.2.80, బీ కేటగిరీలో 0-100 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.4, ఇదే కేటగిరీలో 101-200 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కి రూ.5, 201-300 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.7, 300 యూనిట్లకు మించితే యూనిట్ కు రూ.7.50 వసూలు చేయనున్నారు.