జమ్మూకశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..

 


జమ్మూకశ్మీర్‌లో ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ కూలిపోయింది. బందిపొరా జిల్లా గురేజ్‌లో జరిగిన ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో పైలట్‌ మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గురేజ్ సెక్టార్‌లో మంచుతో నిండిన బరౌమ్ ప్రాంతంలో శుక్రవారం చీతక్‌ హెలికాప్టర్‌ కూలిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే అనారోగ్యంతో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లను తరలించేందుకు ఈ హెలికాప్టర్‌ వెళ్లినట్లు తెలిపారు. మంచుపై ల్యాండింగ్‌ సమయంలో నియంత్రణ కోల్పోయి లయలోకి జారి కూలిపోయిందని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో పైలట్‌ మరణించగా కో పైలట్‌ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కో పైలట్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.


ఈ ప్రమాదం సమాచారం అందుకున్న రెస్క్యూ ఆపరేషన్‌ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. దట్టంగా మంచు అలముకోవడంతో నడుచుకుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బంది పైలట్‌, కో పైలట్‌ కోసం గాలించినట్లు చెప్పారు.