చైనా కు మోదీ షాక్..

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భారత్‌ పర్యటనకు గురువారం వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన విజ్ఞప్తిని భారత ప్రభుత్వం సున్నితంగా, దృఢంగా, వినమ్రంగా తిరస్కరించింది. వాంగ్ దాదాపు రెండేళ్ళ తర్వాత ఆకస్మికంగా భారత్ పర్యటనకు వచ్చారు. తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించని నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. ప్రధాని మోదీ శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. వాంగ్ యీ న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న సమస్యలపై జైశంకర్ చర్చించారు. 2020 ఏప్రిల్ నుంచి ఎల్ఏసీ వెంబడి అసాధారణ రీతిలో మోహరించిన దళాలను చైనా ఉపసంహరించే వరకు ఇరు దేశాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరబోవని స్పష్టం చేశారు. 

వాంగ్ మాట్లాడుతూ, ఇరు దేశాలు దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలన్నారు. సరిహద్దు వివాదానికి అతీతంగా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలన్నారు. భారత దేశంతో సంబంధాలు సాధారణ స్థితికి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. అయితే జైశంకర్ స్పందిస్తూ, మొదట ఎల్ఏసీ వెంబడి ప్రతిష్టంభన పరిష్కారమవాలని స్పష్టం చేశారు. చైనాతో సుస్థిర సంబంధాలను కోరుకుంటున్నామన్నారు.