ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టు కీలక వాఖ్యలు...

 తుది ప్రకటన రాలేదు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. జిల్లాల పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఆర్టికల్‌ 371(d)కి విరుద్ధంగా ఉన్నాయంటూ గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్‌ కుమార్‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త జిల్లాలపై తుది ప్రకటన రానందున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది.


కొత్త జిల్లాల ఏర్పాటు పై..


జిల్లాల పునర్విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి. రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ముసాయిదా నోటిఫికేషన్‌, తదనంతరం జారీ చేసిన జీవోలు అధికరణ 371-డికి విరుద్ధమని.. వాటిని రద్దు చేయాలంటూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు అయ్యింది. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.