ఏపీ లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల తేదీలు ఖరారు..

 


రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూళ్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. గతంలోనే ఒకసారి షెడ్యూల్‌ ప్రకటించినా.. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష తేదీలు మారడం, దాంతో ఇంటర్‌ పరీక్షల తేదీలను కూడా మార్చడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను సైతం మార్చాల్సి వచ్చింది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి శుక్రవారం తాజాగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం టెన్త్‌ పరీక్షలు ఏప్రిల్‌ 27న మొదలై మే 9 వరకు జరగనున్నాయి. అన్ని పరీక్షలూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇంటర్‌ పరీక్షల షెడ్యూలును కూడా అధికారికంగా ప్రకటించారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.