‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుంచి ‘ఎత్తర జెండా’ అనే ప్రమోషనల్ గీతం..

 దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ మరో రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తొలిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా విడుదల గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్, శ్రియా శరణ్ కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా పలువురు బ్రిటీష్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ టెక్నాలజీతో ప్రేక్షకులకు అదిరిపోయే విజువల్ ట్రీట్ ను ఇవ్వబోతున్నాడు జక్కన్న. ఇంతకు ముందు ప్రమోషన్స్ మొదలు పెట్టి.. కరోనా కారణంగా బ్రేకిచ్చిన చిత్ర బృందం.. విడుదల దగ్గర కావడంతో మరింత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాల్ని నెలకొల్పాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి సెలబ్రేషన్ ఆంథమ్ విడుదల చేయబోతున్నారు. కీరవాణి మాసీ ట్యూన్ తో మోతెక్కించనున్న ఈ పాట ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికే హైలైట్ కాబోతోంది. 


ఈ నెల 14న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుంచి ‘ఎత్తర జెండా’ అనే ప్రమోషనల్ గీతాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి మరీ ప్రకటించారు. తారక్, చెర్రీ, ఆలియా డ్యాన్సింగ్ మోడ్ తో రివీలైన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తారక్, చెర్రీలను పాన్ ఇండియా స్టార్స్ గా మార్చేస్తుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉండనుందో తెలియాలంటే.. రిలీజ్ వరకూ ఆగాల్సిందే.