తెలంగాణలో బీజేపీ పార్టీ జోరు..

 


తెలంగాణలో బండి స్పీడ్‌ పెంచారు. తాజాగా మంత్రుల కోటలు బద్దలు కొట్టేందుకు స్కెచ్‌ రెడీ చేస్తున్నారు బిజేపి నేత‌లు. అందుకు సంబంధించిన డాటా సేకరణలో కమలదండు బిజీగా ఉంది. ఇంతకీ ఆ అమాత్యులు ఎవరు ? బీజేపీకి మంత్రుల ఇలాకాలో పట్టు దొరుకుతుందా ? తెలంగాణ బీజేపీ చీఫ్‌ కొత్త స్కెచ్‌ ఏంటీ ? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మంత్రులను ఢీ కొట్టేందుకు కాషాయ దండురెడీ అవుతోంది. హైదరాబాద్‌ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రంగారెడ్డి జిల్లాలో సబితాఇంద్రారెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, కరీంనగర్‌ జిల్లాలో గంగుల కమాలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, నిజామాబాద్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డి, నల్లగొండలో జగదీశ్‌రెడ్డి నియోజకవర్గాలపై కన్సన్‌ట్రేషన్‌ పెట్టాలని నిర్ణయించారు. అమాత్యుల ఇలాకాలో బీజేపీ బలాలపై లెక్కలు తీస్తున్నారు. వారిని ఢీ కోట్టేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై ప్రత్యేకంగా ఒక టీం వేయాలని నిర్ణయించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నేతృత్వంలో ఓ బృందాన్ని నియమించే యోచనలో ఉన్నారు. ఆ టీంలో ఎవరెవరు ఉండాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు.


హైదరాబాద్‌ జిల్లా సనత్‌నగర్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో గత మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీగట్టి పోటీ ఇచ్చింది. నియోజకవర్గంలో ఉన్న 7 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ మూడు, బీజేపీ మూడు, ఎంఐఎం ఒకస్థానంలో విజయం సాధించింది. ఓవరాల్‌గా టీఆర్‌ఎస్‌, బీజేపీకి వచ్చిన ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. దీంతో ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితాఇంద్రారెడ్డిని ఢీకొట్టేందుకు అస్ర్తశస్త్రాలను కమలనాథులు సిద్దం చేసుకుంటున్నారు. మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడ మున్సిపల్‌ ఛైర్మన్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ గూటికి రప్పించారు. మీర్‌పేట, జల్‌పల్లి, బడంగ్‌పేట మున్సిపాల్టీల్లో కమలదళానికి కొంత పట్టుంది. అదే తరహాలో GHMC పరిధిలో ఉన్న సరూర్‌నగర్‌, ఆర్‌కే పురం డివిజన్లలో బీజేపీ గెలిచింది. అదే తరహాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగురవేయడానికి బీజేపీ శ్రేణులు ఊవ్విళ్లూరుతున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌పై బీజేపీ స్పెషల్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టింది. బండి సంజయ్‌ వచ్చేనెలలో ఇదే జిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. పాదయాత్రలో మంత్రి అవినీతిని బయటపెట్టాలని సంజయ్‌ టీం భావిస్తోంది. మంత్రులవే కాకుండా ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను వెలుగులోకి తెస్తామని చెబున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌.


ఇలా మంత్రులనే కాదు.. కాంట్రావర్సీ నేతలుగా ముద్రపడిన ఎమ్మెల్యేలు ఆర్మూర్‌ జీవన్‌రెడ్డి, జనగామ యాదగిరిరెడ్డి లాంటి వారి చిట్టాను రెడీ చేసే పనిలో ఉన్నారు కమలనాథులు. అయితే బీజేపీ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం ఎప్పుడు ప్రకటిస్తారు ? వారు ఎలాంటి పనిచేయాలనే దానిపై అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.