ఇన్‌స్టాగ్రామ్‌ లో సరికొత్త ఫీచర్..

 


సోషల్‌ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ది ప్రత్యేక స్థానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫేస్‌బుక్‌ తర్వాత అంతమంది ఉపయోగిస్తున్న యాప్‌ ఇదే. ముఖ్యంగా యూత్‌ను ఎక్కువగా టార్గ్‌ట్‌ చేసుకుందీ యాప్‌. సరికొత్త ఫీచర్లతో  ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ సోషల్‌ మీడియా దిగ్గజానికి ఈ రేంజ్‌లో క్రేజ్‌ వచ్చింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగిస్తున్న చిన్నారుల సంఖ్య కూడా ఇటీవల పెరిగిపోతోంది. స్కూల్‌కు వెళ్లే వారు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచేస్తున్నారు.


ఇక ఆన్‌లైన్‌ క్లాసులు, టెక్నాలజీతో మారక తప్పని పరిస్థితుల నేపథ్యంలో పిల్లలకు కూడా స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంతకీ మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చూస్తున్నారు.? ఎవరిని ఫాలో అవుతున్నారు.? లాంటి వివరాలను ఎలా తెలుసుకోవాలి.? ఇందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. పేరెంటల్‌ సూపర్‌ విజన్‌  పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఏయే ఖాతాలను ఫాలో అవుతున్నారు.?లాంటి విషయాలను తెలుసుకోవచ్చు.


అంతేకాకుండా ఇతరుల అకౌంట్స్‌ గురించి చిన్నారులు ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ రావడం ఈ ఫీచర్‌ మరో ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా పిల్లల ఖాతా నుంచి ఈ ఫీచర్‌ యాక్టివేషన్‌ కోసం రిక్వెస్ట్‌ పెట్టాలి. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ ఓ యాక్టివేషన్‌ రిక్వెస్ట్ పంపిస్తుంది. దానిని యాక్సెప్ట్‌ చేస్తే మీ చిన్నారుల ఖాతాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు