త్రిబుల్ ఆర్ సినిమాపై సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం...

 


రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన RRR సినిమా ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా మొదటి ఆట నుంచి మంచి టాక్ తో దూసుకుపోతోంది.
ఈ సినిమా విడుదలైన ప్రతి సినిమా థియేటర్ లోనూ కలెక్షన్స్ విషయంలో ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు అద్భుతం అంటూ రివ్యూ ఇస్తున్నారు. అయితే తాజాగా సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా మీద తన రివ్యూ ఇచ్చారు. ఆయన ఏమన్నారు? సినిమా ఎలా ఉందని అన్నారు? అనే వివరాల్లోకి వెళితే..


ప్రశంసల జల్లులు

 

ఎన్నోమార్లు వాయిదా పడిన అనంతరం RRR మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తోంది. ప్రీమియర్ షో నుంచి ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ మొదలైందని చెప్పచ్చు. ఇక రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరచడంతో దేశ నలువైపుల నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.


AMB సినిమాస్ లో

 


ఇక తాజాగా RRR చిత్రం వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తన స్పందనని తొలుత మీడియాతో ఆ తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు. నిజానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి లు తమ ఫ్యామిలీలతో సహా సినిమాను ప్రీమియర్ షోలలో చూసేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి RRR సినిమాను హైదరాబాద్ లోని ప్రిన్స్ మహేష్ బాబు సినిమా థియేటర్ AMB సినిమాస్ లో చూశారు.


క్లాసిక్ అంటూ పొగడ్తలతో

 


మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవి, కూతుర్లు సుస్మిత , శ్రీజ, మనవరాళ్లతో కలిసి తన కుమారుడి సినిమా చూశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ RRR గురించి తన రివ్యూ ఇచ్చేశారు ఈ సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటలు లేవని.. సింప్లీ సూపర్బ్ అని అన్నారు. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య బాండింగ్ ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. వారు డ్యాన్స్ లో ఒకరితో నొకరు పోటీపడి చేశారని వీరి డాన్స్ ఎపిక్, ఇంకా చెప్పాలంటే క్లాసిక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.


హ్యాట్సాఫ్' అంటూ ప్రశంసలు

 


సినీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. స్టార్ హీరోలు కలిసి నటించాలని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆ తరువాత RRR సినిమా అద్భుతంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ RRR, రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుందని పేర్కొన్నారు. RRR చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్' అంటూ ప్రశంసలు కురిపించారు.


RRR​ను ఆస్వాదించండి

 


ఇక మరోపక్క తమ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని హీరో ఎన్టీఆర్​ పేర్కొన్నారు. "మీరు చూపిస్తున్న ఈ అమితమైన ప్రేమ పట్ల ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ప్రేమ, అభిమానం, ప్రోత్సాహం నన్ను నడిపిస్తున్నాయి. విజువల్​ ట్రీట్​ RRR​ను ఆస్వాదించండి" అని ఎన్టీఆర్​ ట్వీట్​ చేశారు.