తెలంగాణ లో ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూళ్లు విడుదల..

 


ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూళ్లు విడుదలయ్యాయి. మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే మే 23 నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు మారిన పరీక్షల షెడ్యూళ్లను బుధవారం ప్రకటించారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల దృష్ట్యా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన కొత్త షెడ్యూల్‌ను అనుసరించి... ఏప్రిల్‌ 21 నుంచి మే 4వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే టెన్త్‌ పరీక్షలను నిర్వహించడానికి వీలుగా షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇంటర్‌ పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ మారడంతో పదవ తరగతి వార్షిక పరీక్షల తేదీలను కూడా మార్చారు.


తాజా షెడ్యూల్‌ ప్రకారం... మే 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. టెన్త్‌ ప్రధాన పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. అయితే చివరి పరీక్ష అయిన ఎస్‌ఎ్‌ససీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)ని మాత్రం ఉ.9.30 నుంచి ఉ.11.30 వరకు నిర్వహిస్తారు. గతంలో టెన్త్‌ పరీక్షల కోసం 2.30గంటల సమయం ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది అదనంగా 15 నిమిషాల సమయాన్ని ప్రశ్నాపత్రం చదువుకోవడానికి, మరో 30 నిమిషాలను పరీక్ష రాయడానికి కేటాయించారు. ఇలా మొత్తం 3.15 గంటల సమయం ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు మినహా మిగిలిన అన్ని రకాల ప్రశ్నల్లో ఛాయిస్‌ను పెంచారు.