ఈనెల 18న కడప లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన..

 


ఇప్పటికే ఉత్తరాంధ్రలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇక సీఎం జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌ చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తలపెట్టిన బాదుడేబాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఛార్జీల పెరుగుల అంశాన్ని టీటీపీ పొలిటికల్‌గా క్యాష్ చేసుకుంటోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, జగన్ చేసిన బాదుడే బాదుడు కామెంట్స్‌ను హైలెట్ చేస్తోంది తెలుగుదేశం. అదే పేరుతో ఉద్యమం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈనెల 18న కడప జిల్లాలోని కమలాపురం, 19న నంద్యాల జిల్లాలోని డోన్, 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. మహానాడు నిర్వహించేలోపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ రెడీ చెసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.


ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించినప్పుడు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈసారి సీమలోని నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టారు చంద్రబాబు. రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిల్లో కేవలం టీడీపీకి 3 స్థానాలే వచ్చాయి. అయితే, చంద్రబాబు ప్రస్తుత పర్యటనకు ప్రజల నుంచి స్పందన వస్తే, అధికార వైసీపీకి పొలిటికల్‌ మెసేజ్‌ ఇచ్చినట్టు అవుతుందని అంచనా వేస్తున్నారు చంద్రబాబు.


అందుకే రాయలసీమలో కీలక నేతలు ఉన్న నియోజకవర్గాల్లో తన కార్యక్రామాలు ఉండేలా ప్లాన్‌ చేశారు. సీమ పర్యటన తర్వాత కోస్తాంధ్రలో చంద్రబాబు టూర్‌ ఉండే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోనూ కీలక నేతల నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహించే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.